అంఫన్ తుపాను
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లకు అదనపు ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు@@update's
న్యూఢిల్లీ : బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి అంఫన్ తుపానుగా రాబోతోందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్ఎఫ్) అప్రమత్తమైంది. ఈ తుపాను ప్రభావం అధికంగా పడే అవకాశం ఉన్న ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు అదనంగా రెండు చొప్పున దళాలను పంపించింది. ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో రెండేసి చొప్పున ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి.
ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలను సాగర్ దీవి, కక్‌ద్వీప్, ఉలుబెరియా, హస్నాబాద్, ఆరాంబాగ్, దిఘాలలో మోహరించారు.
భారత వాతావరణ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ నెల 18-20 తేదీల మధ్య ఈ తుపాను ఉత్తర ఒడిశా తీరం, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ తుపాను క్రమంగా బలపడుతోంది, ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు కదులుతోంది.
బంగ్లాదేశ్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బంగాళాఖాతంలో వాయుగుండం బలపడి తుపానుగా మారుతుంది. ఇది రెండు రోజుల్లో తీరాన్ని దాటే అవకాశం ఉంది.
ఈ తుపాను నైరుతి దిశగా గంటకు 6 కి.మీ. వేగంతో కదులుతోంది. ఆదివారం ఉదయం ఆరు గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమవుతుంది. దక్షిణ ఒడిశా తీరం వెంబడి సోమవారం సాయంత్రం నుంచి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది.
దక్షిణ బంగాళాఖాతంలోకి వెళ్ళరాదని మత్స్యకారులను హెచ్చరించింది.