కరోనా పాజిటివ్ కేసులు: ఇండియాలో ఏపీ ఏడవ స్థానం,

కరోనా పాజిటివ్ కేసులు: ఇండియాలో ఏపీ ఏడవ స్థానం,


ఏపీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూ రోజురోజుకూ విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మరీ ముఖ్యంగా నాలుగైదు రోజుల క్రితం ఏపీలో తక్కువ సంఖ్యలోనే ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇందుకు కారణం ఢిల్లీ నిజాముద్దీన్ ఘటనే. ఈ ఘటన తర్వాతే ఏపీలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయాయి.
ఏడో స్థానం..


కాగా.. ఇండియాలో ఇలా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఏడవ స్థానంలో ఉంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరింది. అత్యధికంగా కర్నూల్‌ జిల్లాలో 74 కేసులు నమోదయ్యాయి.


మొత్తం కేసుల్లో సగం కర్నూలు, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లోవే కావడం గమనార్హం. 24 గంటల వ్యవధిలో 45 కేసుల నమోదవ్వడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం కూడా అలెర్ట్ అయ్యింది. కరోనా పరీక్షా కేంద్రాల సామర్థ్యాన్ని పెంచింది. విశాఖ, గుంటూరు, కడప నగరాల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేసింది. ప్రాథమిక స్థాయిలోను పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. త్వరలోనే రాష్ట్రానికి 240 పరికరాలు రానున్నాయి. ఒక్కో పరికరంతో రోజుకు 20 నమూనాలు పరీక్షించే అవకాశం ఉంటుంది.


రాష్ట్రాల వారిగా చూస్తే.. (సోమవారం వచ్చిన రిపోర్టు ప్రకారం..)


01. మహారాష్ట్ర- 868


02. తమిళనాడు- 621


03. న్యూ ఢిల్లీ - 525


04. తెలంగాణ - 364


05. కేరళ - 327


06. ఉత్తరప్రదేశ్ -308


07. ఆంధ్రప్రదేశ్ - 303 (ఇవాళ కొత్తగా ఒక పాజిటివ్ కేసుతో కలిపితే 304)


ఏపీలో జిల్లాల వారిగా చూస్తే..


మంగళవారం నాడు ప్రభుత్వం విడుదల చేసిన మీడియా బులెటిన్ ప్రకారం కేసులు ఇలా ఉన్నాయి. నిన్నటి వరకూ 303 కేసులుండగా ఇవాళ గుంటూరు జిల్లాలో కొత్తగా ఒక కేసు నమోదైంది. మరోవైపు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం ఇంతవరకూ ఒక్క కేసు కూడా నమోదవ్వలేదు.


కర్నూలు- 74


నెల్లూరు- 42


గుంటూరు- 33


కృష్ణా- 29


కడప- 27


ప్రకాశం- 24


పశ్చిమ గోదావరి- 21


విశాఖపట్నం- 20


చిత్తూరు- 17


తూర్పుగోదావరి- 11


అనంతపురం- 6


విజయనగరం - 00


శ్రీకాకుళం - 00


మొత్తం కేసుల సంఖ్య : 304


ఏపీలో మరణాల సంఖ్య..


కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఈ వైరస్‌తో నలుగురు మృతి చెందారు. ఇవాళ కర్నూలు జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. కాగా.. కర్నూలులో ఈ నెల 3న మరణించిన వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తాజాగా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని మంగళవారం నాడు ప్రభుత్వం మీడియా బులెటిన్‌లో అధికారికంగా ప్రకటించింది.