ఆ డాక్టరు తన చేతులతో ఎన్నో ప్రాణాలు కాపాడి ఉంటాడు. సొంత ఆస్పత్రి ఉంది. పెద్ద కుటుంబం ఉంది. కావల్సినంత ఆస్తి ఉంది కానీ... అయినప్పటికీ ఆయన అనాథ శవంగా మిగిలిపోయారు. కరోనా విపత్తు ఆయన జీవితాన్ని - కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. నిన్ననే కరోనాతో ప్రాణాలు విడిచిన నెల్లూరి వైద్యుడి కథ ఇది.
ఆయన స్వతహాగా ఆర్థోపెడిక్ వైద్యుడు. ఆ విభాగంలో సొంతంగా ఆస్పత్రి నడుపుతున్నారు. అస్వస్థతగా ఉందని నెల్లూరులోని ఒక ఆస్పత్రిలో చేరారు. పరిస్తితి విషమంగా ఉండటంతో అతన్ని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ కరోనా అని తేలవడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచారు. చికిత్స పొందుతూ చనిపోయారు.
దురదృష్టవశాత్తూ ఆయన చనిపోవడానికి ముందే కరోనా వల్ల ఆయన కుటుంబాన్ని క్వారంటైన్ కి తరలించారు. అక్కడ వారికి పాజిటివ్ అని తేలడంతో వారు నెల్లూరులో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత డాక్టరు చనిపోగా కేంద్ర నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగించకుండా కొద్ది మంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపాలి. కరోనా మరణం కావడం - ప్రత్యేక అనుమతులు అవసరం కావడం వల్ల బంధువులు ఎవరూ రాలేదు. సొంత కుటుంబం ఐసోలేషన్ వార్డులో ఉంది. అనాథగా అయినా అంత్యక్రియలు జరిగాయా అంటే అదీ లేదు. ఆస్పత్రి సిబ్బంది ఎలక్ట్రిక్ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. కానీ అక్కడ శవ దహనానికి నిరాకరించారు. మరో చోట కూడా అలాగే జరిగింది. కారణమేంటో తెలుసా... ప్రభుత్వ ఆస్ప్రత్రుల్లో మరణాలకే చేయాలని వారికి నిబంధనలు ఉన్నాయట. ఏం చేయాలో తోచని సిబ్బంది... అంబత్తూరు శ్మశాన వాటిక వద్దకు ఆ డాక్టరు మృతదేహాన్ని సోమవారం సాయంత్రం తీసుకెళ్లారు. ఇది తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున అక్కడ గుమిగూడి ధర్నాకు దిగారు. ఇక్కడ దహనం చేయడానికి వీల్లేదంటూ పట్టుబట్టారు. ఆస్పత్రి సిబ్బందిని దూషించారు. దీంతో వారు మీతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఎంత చెప్పినా స్థానికులు వినకపోవడంతో తిరిగి శవాన్ని మార్చురీకి తీసుకెళ్లారు.
పోలీసులు... బంధువుల అనుమతి తీసుకుని అర్ధరాత్రి అనంతరం ఒక ఎలక్ట్రిక్ విద్యుద్దహన వాటికకు శవాన్ని తీసుకెళ్లారు. భారీ భద్రత మధ్య మృతదేహాన్ని మంగళవారం తెల్లవారుజామున దహనం చేశారు. గొప్ప జీవితం అనుభవించిన ఆ డాక్టరు అనాథ శవంలా తీవ్ర వివాదం మధ్య సొంత వాళ్లు లేకుండా కూడా లేకుండా సంప్రదాయ అంత్యక్రియలు లేకుండా కాలగర్భంలో కలిసిపోయారు. ఈ విషాదకరమైన ఘటన బంధువులను నెల్లూరులో పలువురిని శోకసంద్రంలో ముంచింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
ఈ మరణంలో సొంతవారికి చివరి చూపు దక్కలేదు. మృతుడికి సరైన వీడ్కోలు దక్కలేదు. ఇలాంటి ఘటనలు దేశంలో ఎన్నో జరుగుతున్నాయి. ఇది చదివాక అయిన మీరు ఇంటిపట్టున ఉండండి. ప్రధాని చెప్పినట్లు ఇంట్లో పెద్దవారిని జాగ్రత్తగా కాపాడుకోండి. 50 ఏళ్ల పై వయసు వారికి వస్తే ఇది ప్రమాదం. మరణం కంటే కూడా దిక్కులేని చావు ఇంకా బాధాకరం. దయచేసి ఇంట్లోనే ఉండండి.