రైతులను ఆదుకునే చర్యలు, రేషన్ పంపిణీ అంశాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.
మే 15 కల్లా రైతు భరోసాకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. ఎవరైనా మిగిలిపోతే.. వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై ఓ ప్రొసీజర్‌ను మళ్లీ గ్రామ సచివాలయాలకు పంపాలన్నారూ
రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్
ఆంద్రప్రదేశ్ ముఖ్యంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. కరోనా నివారణా చర్యలు, రైతులను ఆదుకునే చర్యలు, రేషన్ పంపిణీ అంశాలపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. మే 15 కల్లా రైతు భరోసాకు సిద్ధం కావాలని సీఎం సూచించారు. ఎవరైనా మిగిలిపోతే.. వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై ఓ ప్రొసీజర్‌ను మళ్లీ గ్రామ సచివాలయాలకు పంపాలన్నారు. అర్హతలను, ఎవరెవరికి దరఖాస్తు చేయాలో సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు.
ఇక ఇళ్ల పట్టాల కోసం తీసుకున్న ప్రతి ఎకరా భూమికి కన్సెంట్‌తోనే, వారికి ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతనే తీసుకున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను అన్నారు జగన్. పొజిషన్‌లోకి తీసుకోవాల్సిన భూమిని వెంటనే ధ్యాసపెట్టి కంప్లీట్ చేయాలని ఆదేశించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే మేలో దీనికి సంబంధించి పంపిణీకి చర్యలు తీసుకుందామన్నారు. లే అవుట్ డెవలప్‌మెంట్ సహా చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తిచేయాలన్నారు. ఇటు వ్యవసాయంపైనా కొన్ని సూచనలు చేశారు.
మార్కెటింగ్‌కు సంబంధించి కొన్ని వినూత్న ఆలోచనలు చేస్తున్నామన్నారు సీఎం. ఈ సమయంలో వ్యవసాయాన్ని కాపాడుకోగలిగితే.. రైతులు ఇబ్బంది పడకుండా చూసుకోగలిగితే.. 60శాతం ఆర్థిక వ్యవస్థను మనం నిలబెట్టుకోగలుగుతామన్నారు. వ్యవసాయం అన్నది పూర్తిగా ధ్యాసపెట్టాల్సిన అంశమని వ్యాఖ్యానించారు. గ్రామ స్థాయినుంచి మార్కెట్ ఇంటెలిజెన్స్ రావాలి అన్నారు సీఎం. గ్రామంలో రైతులు ఏమైనా ఇబ్బందులు పడితే.. వెంటనే ఆ సమాచారం రావాలి అన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్ తనకు ఇచ్చిన ట్యాబ్ ద్వారా ఈ సమాచారాన్ని నివేదించాలని.. ఈ సమాచారం పైస్థాయిలో ఉన్నవారికే కాకుండా జిల్లా కలెక్టర్లకూ వెళ్లాలన్నారు. రైతులు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు.. ఏ పంటకు తక్కువ ధర వస్తుంది కలెక్టర్లకు సమాచారం రావాలి అన్నారు. తర్వాత ఈ వివరాల ఆధారంగా మార్కెటింగ్‌శాఖ అధికారులతో మాట్లాడాలని.. మన రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకు వెళ్తాయన్నారు.
కరోనా దెబ్బకు ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు నడవడంలేదని.. రవాణా కూడా జరగడంలేదన్నారు జగన్. మధ్యలో ఆపేస్తారనే భయంతో లారీల రవాణా నడవడంలేదని.. ఈ సమస్యలపైన రోజూ ఉన్నతాధికారులు దృష్టిపెడుతున్నారని.. కలెక్టర్లు కూడా ఈ సమస్యల పరిష్కారానికి దృష్టిపెట్టాలన్నారు. మార్కెటింగ్ అధికారులతో మాట్లాడాలని.. రవాణాకూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బయట మార్కెట్లకు పంపించడమే కాదు, స్థానిక మార్కెట్లపైన కూడా దృష్టిపెట్టాలని సూచించారు. స్వయం సహాయక సంఘాలు, రైతు బజార్ల, వార్డులు స్థాయి, గ్రామస్థాయిల వరకూ అరటిని పంపుతున్నామన్నారు సీఎం. ఏ రైతు ఇబ్బంది పడుతున్నా.. మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, రవాణాను అందుబాటులోకి తీసుకురావడంపై కలెక్టర్లు దృష్టిపెట్టాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు.
ధాన్యం కొనుగోళ్లు గ్రామస్థాయిలో చేస్తున్నామన్నారు ఏపీ సీఎం. అగ్రికల్చర్ అసిస్టెంట్‌కు బాధ్యతలు అప్పగించామని.. మొదటిసారి ఫాంగేట్ పద్దతిలో ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం రాష్ట్రానికి రాకుండా నిలిపేశామని.. మద్దతు ధర కన్నా తక్కువ ఖరీదుకు ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం అన్నారు. సరిహద్దుల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూసుకోవాలని సంబంధిత కలెక్టర్లను ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా వెంటనే సీఎం కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించారు.. వెంటనే దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తామన్నారు.
ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి కూడా గడిచిన కొన్ని రోజులు గట్టి చర్యలు తీసుకున్నామన్నారు జగన్. ఆయా ప్రాంతాల్లో ఉన్న కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలని.. ఆక్వా రైతులకు మేలు చేయాలని సూచించారు. ప్రాససింగ్ ప్లాంట్లు పనిచేసేలా, ఎగుమతులు జరిగేలా చూడాలన్నారు. ఎంపెడా నిర్దేశించిన రేట్లకు కొనుగోలు చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని.. అలాగే చేపల దాణా రేట్లను విపరీతంగా పెంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. వాటి రేట్లు కూడా పెరగకుండా చర్యలు తీసుకోవాలని.. ఇంతకుముందు ఏ రేట్లు అయితే ఉన్నాయో అవే రేట్లకు అమ్మాలన్నారు. ఆక్వా రంగంలో స్థిరీకరణ ఉంటుందని.. ఆక్వా అసిస్టెంట్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకోవాలన్నారు.