కరోనా  పాాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్

కరోనా  పాాజిటివ్ కేసులు నమోదైన 75 జిల్లాల్లో మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో మరిన్న కీలక నిర్ణయాలు తీసుకుంది.


హైదరాబాద్, విజయవాడ సహా 75 జిల్లాలు లాక్ డౌన్.. కేంద్రం షాకింగ్ నిర్ణయం
దేశంలో కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కేసులు బయటపడ్డ జిల్లాలను మార్చి 31 వరకు లాక్ డౌన్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆదివారం (మార్చి 22) ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో మార్చి 31 వరకు జనతా కర్ఫ్యూ కొనసాగబోతోంది. ఈ జిల్లాల్లో మార్చి 31 వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవన్నీ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర కేబినెట్ కార్యదర్శి తదితర ఉన్నతాధికారులతో కేంద్ర ప్రభుత్వం దేశంలో కరోనా పరిస్థితిపై ఆదివారం సమీక్ష నిర్వహించింది. అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థంగా నియంత్రించడానికి కరోనా ప్రభావిత జిల్లాలను మూసేయడం మేలని ఈ సమావేశంలో ఏకాభ్రిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇచ్నిన పిలుపుతో ఆదివారం ప్రజలందరూ బయటకు రాకుండా జనతా కర్ఫ్యూకు సహకరించిన నేపథ్యంలో దీన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కరోనా వైరస్ కేసులు బయటపడ్డ జిల్లాలన్నీ మార్చి 31 వరకు లాక్ డౌన్ అవనున్నాయి. వీటిలో తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు; ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో జనతా కర్ఫ్యూను 48 గంటలకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విజయవాడలోనూ కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో బెజవాడ నగరాన్ని కూడా మార్చి 31 వరకు లాక్ డౌన్ చేసే అవకాశం ఉంది.


కరోనా వైరస్ కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా అన్ని రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చింది. గూడ్స్ రైళ్లకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. అన్ని నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు నిలిపేయాలని ఆదేశించారు. మార్చి 31 వరకు – అంతర్రాష్ట్ర ప్రజా రవాణా సర్వీసులు బంద్ చేయాలని సూచించారు.


మరోవైపు.. కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో మార్చి 31 వరకు షట్ డౌన్ విధించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అటు ఏపీ ప్రభుత్వం కూడా ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం