ప్రతీ మనిషి ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో పుడతాడు

 


ప్రతీ మనిషి ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతంలో పుడతాడు.. ఎక్కడ పుట్టాలి ఎవరికి పుట్టాలి అనే చాయిస్ ఎవ్వరికీ  ఉండదు.. 
ఏదో దేశం లో ఏదో మతం లో  ....మన దేశంలో అయితే ఎదో కులం లో కూడా  పుట్టవచ్చు. 


మన దేశంలో పుట్టిన పిల్లాడికి ఏ మతం ఏ కులం ఉండదు. జన్మతహా వాడు మనిషే....
ఉదాహరణకి ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన పిల్లవాడిని ఒక దళిత కుటుంబం లో పడవేస్తే ఆ పిల్లవాడు ఒక దళిత గుర్తింపు పొంది దళితుడిగా ఎదుగుతాడు..అలాగే ఒక దళిత కుటుంబంలో పుట్టిన పిల్లవాడిని ఒక బ్రాహ్మణ కుటుంబంలో వేస్తే ఆ పిల్లవాడు ఒక బ్రాహ్మణుడిలా పెరుగుతాడు..


సో ఇక్కడ ఈ కులం లో పుడితే ఈ గుణాలు కలిగియుంటారు అనేది పచ్చి అబద్ధం..ఈ కుల సమూహాలు గుంపులుగా ఒకే చోట ఉండటం వల్ల కొంత వరకు వాటి ప్రభావం అందులో పెరిగిన వ్యక్తి మీద ఉండటం సర్వ సహజం. 
మన కులపొల్లు వేరు..మన లెక్క వేరు..మన సంస్కృతి మన చరిత్ర..ఇలా రకరకాలుగా చరిత్రని తమకి అనుకూలంగానో ప్రతికూలంగానో చెబుతూ..ఒక డీపర్ కన్సైన్స్ లో ఒక కుల మార్కు వదిలేస్తాయి..
అతను  పెరిగి ఎంత పెద్దవాడు అయినా లోపల వేసిన విత్తు సైలెంట్ గా మొలుస్తూనే ఉంటుంది. 


 మతం కూడా అంతే.. మనిషి పుట్టినప్పుడు అతడికి ఏ మతం ఉండదు.. ఎక్కడ పుట్టినా..పెద్ద ఫరక్ పడదు..ఎక్కడ పెరిగావు అనేదే నీ ఆలోచనని ప్రభావితం చేస్తుంది..నిన్ను ముస్లింని చేసినా, క్రైస్తవుడిని చేసినా, హిందువును చేసినా...  నిన్ను పెంచిన విధానమే.
సో నువ్వు పెరిగిన కుటుంబం..నువ్వు పెరిగిన సమాజం ..నువ్వు విన్న భక్తి కధలు..నువ్వు బాల్యం లో పాడిన భక్తి పాటలు, చేసిన ప్రార్థనలు....నువ్వు చదివిన మత గ్రంధాలు నిన్ను ఒక మతానికి పరిమితం చేస్తాయి. 


ఇలా పెరిగిన నేపథ్యం లో..నువ్వు పెరిగిన మతం లో ఉంటావా..లేక జంప్ చేసి వేరే మతానికి వెళతావా..లేదా ఈ మతమే నాకు అక్కర లేదు నేను మతం లేకుండా ఎలా పుట్టానో అలాగే బ్రతుకుతాను అనుకొంటావో అన్ని నీ స్వీయ నిర్ణయాలే.....
క్లుప్తంగా చెప్పాలంటే మతం అనేది నీ వ్యక్తిగత నిర్ణయం. నీ అంతట నువ్వు తేల్చుకోవాల్సినది. 


ఈ మతాలు కులాలు ప్రక్కన పెడితే నువ్వోక విశ్వనరుడవు. ప్రస్తుతం మనిషికి తెలిసిన విశ్వంలో నువ్వే మేధావివి. నీ ఆలోచన కాంతికన్నా వేగమైనది..ఈ అనంత విశ్వం ముందు నువ్వు సముద్రంలో ఇసుక రేణువు అంతా కూడా కాకపోవచ్చు..కానీ నీ ఆలోచనలో ఆ సముద్రమే ఇసుక రేణువు అంత. 


మన సూర్యమండలం లో సూర్యోడు అతిపెద్ద నక్షత్రం..సూర్యోడు మనకన్నా ఎన్ని రెట్లు పెద్దగా ఉంటాడో ఆలోచించారా?? ఆశ్చర్యం..ఒక సూర్యుడి లో
అక్షరాల 13 లక్షల భూములు పడతాయి.. ఉహకి కూడా అందని సైజు ఇది. సూర్యుడి నుంచి నెప్ట్యూన్ కు దూరం షుమారు 440 కోట్ల కిలోమీటర్లు. మన పాల పుంతలో మన సౌరమండలం ఒక అంచున ఉంది. మన సౌరమండలం నుంచి పాల పుంతకి ఉన్న దూరం కిలోమీటర్లలో చెప్పలేము. సూర్యుడు నుంచి పాలపుంత కేంద్రానికి దూరం 27 వేల కాంతి సంవత్సరాలు. ఒక కాంతి సంవత్సరం అంటే.. కాంతి ఒక సంవత్సరం లో ప్రయాణించే దూరం. కాంతి వేగం మీ అందరికి తెలుసు.సెకెనుకు 3 లక్షల మీటర్లు. ఉహించండి..మన పాల పుంత ఉనికి ఎంత పెద్దదో..ఉహకి కూడా అందనంత..లాస్ట్ గా ఇంకొక్కటి చెప్తాను..మనకి తెలిసిన విశ్వంలో ఇటువంటి పాలపుంతలు కొన్ని కోట్లు ఉన్నాయి...అందుకే అంటాను నువ్వు విశ్వనరుడవు.


ఈ అనంత విశ్వంలో మనిషిని మించిన తెలివైన జీవి ఇంకా మనకి తగల లేదు..ఈ విశ్వంలో లో ఉనికి ఉన్నది ప్రస్తుతానికి మనకే..మనుష్యులకె..
ఇంత పెద్ద  విశ్వంలో ..నీ ఆలోచన కేవలం ఒక మతానికో ..కులానికో ..ఒక ప్రాంతానికో బందీ చెయ్యకు..నువ్వు ఎవ్వడికి బానిస కాదు..ప్రకృతికి నీ కులం,  మతం, వర్గం, ప్రాంతం తో సంబంధం లేదు..
కొంచెం లోతుగా ఆలోచిస్తే నువ్వే కదా ప్రకృతి..