అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని

గుంటూరు : అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉంటామని చెప్పామని, ఇప్పుడు ఇచ్చిన మాట నెరవేరుస్తున్నామని ఎపి ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు.


ఎన్నికల ముందు పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని చెప్పారు. గురువారం గుంటూరులోని పోలీసు కవాతు మైదానంలో కొందరు అగ్రిగోల్డ్‌ బాధితులకు సిఎం జగన్‌ చెక్‌ లను అందజేశారు. అనంతరం బహిరంగ సభలో సిఎం జగన్‌ మాట్లాడుతూ... 3.70 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో రూ.265 కోట్లు వేస్తున్నామన్నారు. రూ.10 వేలలోపు ఉన్న అగ్రిగోల్డ్‌ బాధితులకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తన పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితులు తనను కలిసి బాధలు చెప్పుకున్నారని, వారి ఆవేదన అర్థం చేసుకున్నానని చెప్పారు. తొలి కేబినెట్‌ లోనే అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వ పాలనలోనే అగ్రిగోల్డ్‌ కుంభకోణం జరిగిందని, అయినప్పటికీ వారు పట్టించుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తాము కేవలం అయిదు నెలల్లోనే 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని, ఏడాదికి రూ.10 వేలను ఇస్తూ ఆటో కార్మికులను ఆదుకుంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కఅషి చేస్తున్నామని జగన్‌ వ్యాఖ్యానించారు.