రాష్ట్ర వ్యాప్త రైతాంగానికి 15 నుంచి అమలు చేయనున్న రైతు భరోసా పథకం అన్నదాతలకు ఎనలేని మేలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అలాంటి పథకంపై కూడా విపక్ష టీడీపీ విమర్శలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. ప్రధాన మంత్రి(పీఎం) కిసాన్ యోజన పథకంతో కలిపే రైతు భరోసాను అమలు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం మాదిరిగా కేంద్ర పథకాన్ని తమ పథకంగా చెప్పుకోవడం లేదన్నారు. ఆదివారం కాకినాడలో మంత్రి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని దివంగత సీఎం వైఎస్ తన పాదయాత్రలో హామీ ఇస్తే, అప్పట్లో సదరు హామీ సాధ్యం కాదంటూ టీడీపీ నాయకులు విమర్శించారని కన్నబాబు అన్నారు. సీఎం జగన్ ప్రజాసంకల్ప యాత్రలో అన్నదాతలకు ఊరటకలిగించే 'రైతు భరోసా'పై హామీ ఇచ్చారని, ఇప్పడు దానిని నెరవేరుస్తుంటే టీడీపీ నాయకులు లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు భరోసా పథకం అన్నదాతలకు ఎనలేని మేలు చేస్తుంది