ఉద్యోగులకు రెండేళ్లకే ప్రమోషన్...ఎపి గవర్నమెంట్ నూతన జివో జారీ..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త...ఎపి గవర్నమెంట్ తమ ఉద్యోగుల పదోన్నతి నిబంధనల్లో సడలింపు ఇచ్చింది. గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ పొందాలంటే ఇకపై కనీస సర్వీసు రెండేళ్లు ఉంటే సరిపోతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులతో కూడిన జీవోఎంఎస్ నంబర్175 జారీచేశారు.
ఇంతకుముందు జీ.వో.నెం.627 ప్రకారం 1983 డిసెంబరు 21నుంచి 2014 మే 30వరకు ఐదేళ్ల కనీస సర్వీసు, జీ.వో.నెం.230 ప్రకారం 2014 మే 31నుంచి ఇప్పటి వరకు మూడేళ్ల కనీస సర్వీసు ఉంటేనే ప్రమోషన్ ఇస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎదురవుతున్న పాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పదోన్నతి నిబంధనల్లో సడలింపు చెయ్యాలని , ఈ గడువును రెండేళ్లకు తగ్గించాలని ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసమే విడిగా అడ్‌హాక్ రూల్స్‌ను జారీ చేసింది.