‘‘ప్రతిదానికి సీఎం కేసీఆరే పిలిచి మాట్లాడాలా?


ప్రతిదానికి సీఎం కేసీఆరే పిలిచి మాట్లాడాలా? మేమంతా మనుషులం కాదా?'' అని ఆర్టీసీ కార్మికులను మంత్రి తలసాని శ్రీనివా్‌స యాదవ్‌ ప్రశ్నించారు. పండగ పూట సమ్మె వద్దని, న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా నెరవేరుస్తామని గతంలోనే కేసీఆర్‌ స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌పై కార్మిక సంఘాల నేతలు మొండిపట్టుదలతో వ్యవహరించారని, ఇప్పటికీ అలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నియమించిన ముగ్గురు సభ్యుల కమిటీకి తమ డిమాండ్లను సైతం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా అంశంపై సాధ్యాసాధ్యాల గురించి ప్రభుత్వంలో ఉన్న వారికే తెలుస్తుందని అన్నారు. టీఆర్‌ఎ్‌సఎల్పీలో శనివారం ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ను టీఎన్జీవో, టీజీవో నేతలు సాధారణంగానే కలిశారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్‌ వాళ్లకు దమ్ముంటే ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయించాలని సవాల్‌ చేశారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామని తాము మేనిఫెస్టోలో పేర్కొనలేదని గుర్తు చేశారు. సోషల్‌ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయంలో మీడియాకు అనుమతి నిరాకరణ, ఆర్టీసీ కార్మికులను పూర్తిగా ఉద్యోగాల నుంచి తొలగించిన విషయాలు తనకు తెలియదని చెప్పారు.