తెలుగురాష్ట్రాల్లో... ఇక కమలం జోరు

తెలుగురాష్ట్రాల్లో... ఇక కమలం జోరు
◆ అమిత్ షా స్పెషల్ ఫోకస్
◆ 2024 లక్ష్యంగా పావులు
◆ కమ్మ,  కాపు, ఇతర బిసీలతో ముందుకు
◆ ట్రేడ్ యూనియన్ల వైపు కూడా దృష్టి


*_అపర చాణక్యుడు అమిత్ షా దక్షిణ రాష్ట్రాలపై ఫోకస్ పెట్టాడు. బీజేపీకి తెలంగాణలో కొంత ప్రాధాన్యత ఉంది గానీ ఏపీలో మాత్రం తగినంత ప్రాతినిధ్యం లేదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రాధాన్యత కలిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అమిత్ షా. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత కోల్పోయామని భావిస్తున్న కమ్మ, కాపు, ఇతర బిసి సంఘ నాయకులను తమతో కలుపుకు పోవాలని ఆయన పథకాలు రచిస్తున్నారు._*


*టార్గెట్ 2024..:*
2024 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుని దేశవ్యాప్తంగా బీజేపీని బలమైన శక్తిగా చేయాలనే ఉద్దేశంతోనే అమిత్ షా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే గవర్నర్ నరసింహన్‌ను తొలగించి ఆయన స్థానంలో తమిళిసై సౌందరాజన్‌ ను తెలంగాణకు గవర్నర్‌ గా బాధ్యతలను అప్పజెప్పారు. అలాగే కిషన్ రెడ్డి కి కీలకమైన హోంశాఖ సహాయ మంత్రి హోదా ఇచ్చి బలమైన క్యాడర్ ను కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలనే ధ్యేయంతో ఆయన పావులు చాపకింద నీరులా కదుపుతోంది.


*కమలంలో 'కులం' ఆకర్ష:*
భాజపా ఇప్పుడు సరికొత్త ఎత్తులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రెడ్డి, తెలంగాణలో వెలమల ఆధిపత్యంతో కమ్మ, కాపు, ఇతర బిసి నేతలు ప్రాభవం కోల్పోయినట్లు భావిస్తున్నారు. వీరిలో ఇప్పటికే కొందరు కమ్మ నాయకులు కమలం తోటలోకి వెళ్ళారు. కొందరు వెళ్ళనున్నారు. బిసి నేతల కోసం ఆకర్షణ పథకం ఇద్దరు ప్రముఖ భాజపా నాయకులకు కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. 


*ట్రేడ్ లో మారనున్న ట్రెండ్:* 
ట్రేడ్ యూనియన్లలో కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాలకు గతంలో మంచి పట్టు ఉండేది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం ఏర్పడటంతో కార్మిక సంఘాల్లో తెరాస కొంత పట్టు సాధించింది. తాజాగా  భాజపా కేంద్ర రాష్ట్ర సమన్వయ కర్తకు ' ట్రేడ్ యూనియన్' నాయకులను ఆకర్షించే అదనపు బాధ్యతలు అప్పగించింది. దీంతో కార్మిక సంఘాల నేతలు కూడా కమలంతో కలసిపోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది 


*కేంద్రంతో కేసీఆర్..:*
కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంతగా సఖ్యత లేకపోవడం… కేసీఆర్ పాలనను దృష్టిలో పెట్టుకునే ఆయనకు ధీటైన మహిళనే గవర్నర్ గా రంగంలోకి దించింది బీజేపీ. 
అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు దక్కించుకుంది. అదే పార్లమెంట్ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఏకంగా 4స్థానాలు. గెలించింది. దానికి తోడు అవకాశం దొరికినప్పుడల్లా లక్ష్మణ్ తో అన్ని విషయాలను బహిరంగంగా భాజపా మాట్లాడిస్తోంది. ఇటీవల ఢిల్లీలో ప్రధానమంత్రి మోడిని కలసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 30వేల కోట్లు అడిగారు. అయితే కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదు. దీనికి తోడు ఆర్టీసీ వ్యవహారాన్ని రాష్ట్ర నాయకులు బహిరంగంగా ఉపయోగించుకుంటున్నారు.


*ఆంధ్రాలో ఇలా..:*
ఇది ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం బీజేపీ తగినంత ప్రాధాన్యత సాధించలేకపోతోంది. అందుకు చాలానే కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా విభజన అనంతరం ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఖాళీ కావడానికి ఓ కారణమైంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసిన బీజేపీ పుంజుకోలేదు. కృష్ణంరాజు వంటి సీనియర్ నేతలు ఏపీలో బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నా వారిని కాదని బిశ్వభూషణ్ హరిచందన్‌ ను ఏపీకి నూతన గవర్నర్‌గా నియమించింది.


*జగన్ సఖ్యత..:*
అటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి వైఎస్‌ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరి కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి కావలసిన నిధులను తీసుకుంటున్నారు. 'ప్రత్యేక హోదా' అనే అంశం తప్ప.. రాష్ట్రానికి ఏవిధమైన సహాయం చేయడానికి సిద్ధమేనని బీజేపీ తెలిపింది. మరి ఇలాంటి తరుణంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా ఎలాంటి వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేస్తారో వేచి చూడాలి.


*మూడు రాష్ట్రాల ముచ్చట:*
మరోవైపు నరేంద్రమోదీ జమిలి ఎన్నికలపై గురి పెట్టిన సంగతి తెలిసిందే. 2022లో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించి దేశవ్యాప్తంగా కాషాయ జెండా రెపరెపలాడేలా చేయాలని బీజేపీ యోచిస్తోంది. దీంతో.. ఈ ఏడాది ఆఖరిలో జరిగే మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్‌లలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే విడిగా జరిగే తుది ఎన్నికలవుతాయని, వీటికి కూడా మరో మూడేళ్లలో మళ్లీ జమిలి ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరగక తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కాబట్టి భవిష్యత్తులో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.