భవిష్యత్‌ తరాలకు నీటి కొరత లేకుండా చూడాలి


భవిష్యత్‌ తరాలకు నీటి కొరత లేకుండా చూడాలి
అమలాపురం :
భూ గర్భ జలాలు కలుషితమవుతున్న తరుణంలో వాటి పరిరక్షించుకుంటూ భవిష్యత్‌ తరాలకు నీటి కొరత లేకుండా చూడాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్‌కుమార్‌ అన్నారు. ప్రధాని మోడీ జన్మదిన వారోత్సవాల సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక రవణం మల్లయ్యవీధి సుభాష్‌చంద్రబోస్‌ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో నీటి కాలుష్యం-పర్యావరణ పరిరక్షణపై జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత ప్రధానాంశాలుగా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలని పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పులపర్తి నారాయణమూర్తి మాట్లాడుతూ మోడీ సేవా సప్తాహం కార్యక్రమంలో నీటి కాలుష్యం-పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలతో విద్యార్థుల్లో అవగాహన పెంపొందుతుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకంతో పాటు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాలని అన్నారు. కార్యక్రమంలో ఎవిస్‌ హాస్పిటల్‌ కో ఆర్డినేటర్‌ డి.అచ్యుత్‌ మాట్లాడుతూ ప్రధాని మోడీ పిలుపు మేరకు 2015 మే నెల నుంచి ఇప్పటి వరకూ తమ హాస్పిటల్‌ తరపున ప్రతినెలా ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వేలాది మంది రోగులకు మందులు, వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. గంగా సీడ్స్‌ ప్రతినిధులు కోన త్రినాధ్‌, బాలాజీలు మాట్లాడుతూ రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రీయ ఎరువులతో కూరగాయ పంటలు పండించాలని అన్నారు. ఈ మేరకు జిల్లాలో 556 పాఠశాలలకు ఉచితంగా నారు, విత్తనాలు పంపిణీ చేసామని, ఈ పాఠశాలను కూడా దత్తత తీసుకుని నల్లా ఛారిటబుల్‌  ట్రస్టు తరపున ఏడాది పొడవునా ఉచితంగా విత్తనాలు ఇవ్వడంతో పాటు మొక్కల సంరక్షణ, నారు కూడా తమ సంస్థ ద్వారా సేవలందిస్తామన్నారు. ఈ నెల 22న స్థానిక షాదీఖానాలో జరిగే కాళ్లలో నరాల వాపు వ్యాధి, బోధకాల వ్యాధులపై మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అంతేకాకుండా వినికిడి సమస్యలున్న వారికి దీన్‌ దయాళ్‌ శ్రవణా ఫౌండేషన్‌ వారి సహకారంతో యంత్రాలు పొందేందుకు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో  నీటి కాలుష్యం-పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయ్యగారి కృష్ణసుందర్‌, జంగా రాజేంద్రకుమార్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గనిశెట్టి అరవింద్‌, ఆకుల వీరబాబు, నాయకులు బసవా సింహాద్రి, సలాది నాగేశ్వరరావు, అరిగెల నాని, అయ్యల బాషా, గోకరకొండ గంగన్నస్వామి, కాటా బాలయ్య, ఉప్పు జగదీష్‌, కట్టమూరి నరసింహారావు, పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్‌ మలిశెట్టి వీరాస్వామి, ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.