ఇస్రోకి ప్రతిష్టాత్మకమ్ చంద్రయాన్​-2లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. 

 


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్​-2లో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమవుతోంది. 


ఈ మంగళవారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన వాహకనౌక నుంచి.. 'విక్రమ్' ల్యాండర్​ వేరు కానుంది. 


సెప్టెంబర్​ 7న చంద్రుడిపై ల్యాండర్​ దిగనుందని ఇస్రో అధినేత శివన్​ వెల్లడించారు. 


తెల్లవారుజామున 1.55 గంటలకు ఈ ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.


చంద్రుని కక్ష్యను ఈ బుధవారమే రెండోసారి తగ్గించుకున్న చంద్రయాన్​-2.. కీలక ఘట్టానికి ముందే మరో మూడుసార్లు కక్ష్యను తగ్గించుకోనుంది. 


అనంతరం చంద్రుని ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరంలోని తుది ఆర్బిట్​కు చేరుకుంటుంది. 


విక్రమ్​ ల్యాండర్​​ సెప్టెంబర్​ 2నే ఆర్బిటర్​ నుంచి వేరై చంద్రుని చుట్టూ 100 కి.మీ X 30 కి.మీ ఆర్బిట్​లోకి ప్రవేశించనుంది. 


అనంతరం సెప్టెంబర్​ 7న జాబిల్లి ఉపరితలంపై దిగనుందని ఇస్రో ప్రకటించింది.



ప్రధానికి ఆహ్వానం..


విక్రమ్​ ల్యాండర్​ చందమామపై దిగే అద్భత ఘట్టానికి హాజరవ్వాలని ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు శివన్​ తెలిపారు. 


ఇస్రో సంస్థలో లింగబేధాలు లేవని.. చంద్రయాన్​-2 ప్రయోగ సమయంలో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కిందని గుర్తుచేశారు శివన్​. 


భవిష్యత్తులో జరగబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లోనూ మహిళా శాస్త్రవేత్తలను భాగస్వాములను చేస్తామని స్పష్టం చేశారు.



శివన్​కు కలాం అవార్డు..
తమిళనాడు ప్రభుత్వం ప్రదానం చేసే డాక్టర్‌ ఏ పీ జే అబ్దుల్‌ కలాం పురస్కారాన్ని ఇస్రో ఛైర్మన్‌ కే శివన్‌ అందుకున్నారు. 


శాస్త్ర సాంకేతిక రంగాల్లో సేవలందించినందుకు గానూ.. గురువారం ఉదయం ఈ అవార్డును శివన్​కు అందజేసింది తమిళనాడు ప్రభుత్వం. 


5 గ్రాములు విలువ చేసే బంగారు పతకం, 5 లక్షల రూపాయల నగదును ఇస్రో అధినేతకు అందజేశారు ముఖ్యమంత్రి పళనిస్వామి.