నకిలీ విత్తనాలు పట్టివేత

 


తెలంగాణ:


తాండూరు :  తాండూరు మండల కేంద్రంలోని తంగెళ్ళపల్లి గ్రామానికి చెందిన పొనకంచి మురళీక్రిష్ణ అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.2లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలు, 20 లీటర్ల గ్లైపోసెట్‌ గడ్డి మందును సోమవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకొని తాండూరు పోలీసులకు అప్పగించారు. తాండూరు  ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం రామగుండం కమీషనరేట్‌ సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఇంచార్జి సీఐ సతీష్‌,  ఎస్సై సమ్మయ్యలు కలిసి పక్కా సమాచారం మేరకు మురళీక్రిష్ణ ఇంట్లో దాడి చేసి విత్తనాలను పట్టుకున్నట్లు తెలిపారు. మురళీక్రిష్ణను విచారించగా వ్యవసాయం పేరుతో ఇక్కడ ఉంటూ మందమర్రికి చెందిన మల్లికార్జున్‌ అనే వ్యక్తితో కలిసి గత మూడేళ్ళుగా ఆంధ్రా నుండి నకిలీ విత్తనాలను తీసుకువచ్చి రైతులకు విక్రయిస్తున్నట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో మందమర్రికి చెందిన మల్లికార్జున్‌రావును అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా గుంటూరు జిల్లాకు చెందిన దాసపల్లి మల్లికార్జున్‌ తమకు విత్తనాలను సరఫరా చేస్తున్నాడని తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం తాండూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇది వరకే నిందితులపై కేసులు ఉన్నట్లు ఆయన వివరించారు