జర్నలిస్టులకు పెన్షన్ స్కీం కోసం కృషి
ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిడిల్లీబాబు రెడ్డి
జంగారెడ్డిగూడెం, : ఉద్యోగ విరమణ చేసిన జర్నలిస్టులకు నెలవారీ పెన్షన్ పధకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కృషి చేస్తోందని ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. డిల్లీబాబు రెడ్డి చెప్పారు. ప్రభుత్వాలపై ఆర్థిక భారం పడకుండా మీడియా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ప్రకటన ఛార్జీల నుండి రెండు శాతం నిధులు జర్నలిస్టుల సంక్షేమానికి జమ చేస్తే ఈ పెన్షన్ స్కీంను సునాయాసంగా నిర్వహించవచ్చునని ఆయన సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో అన్నపూర్ణ హెరిటేజ్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎపిఎంఎఫ్ డివిజన్ సర్వసభ్య సమావేశంలో డిల్లీబాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల పెన్షన్ స్కీం అమలు కోసం ఇప్పటికే పలు రాష్టాలలో అమలులో ఉన్న పధకాలను సమగ్రంగా అధ్యయనం చేసి ఒక ప్రతిపాదన సిద్ధం చేశామని, త్వరలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డిని కలిసి ఈ ప్రతిపాదన అందజేస్తామని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చెందాల్సిన పని లేదని, రాష్ర్టంలో పని చేసే ప్రతి జర్నలిస్టుకు వారు పని చేసే ప్రాంతంలోనే ఇళ్ళ స్థలం ఇచ్చేందుకు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారని డిల్లీబాబు గుర్తు చేశారు. తన ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్, ఖురాన్ ల మాదిరిగా భావిస్తున్న జగన్ జర్నలిస్టులకు ఖచ్చితంగా ఇళ్ళ స్థలాలు ఇస్తారనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. నిబంధనలు పాటించే ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించే దిశగా ఎపిఎంఎఫ్ కృషి చేస్తోందని ఆయన తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ను జర్నలిస్టులందరూ బలపరచాలని ఆయన కోరారు. సమావేశానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత అలుగు ఆనంద శేఖర్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మీడియా సంస్థలు కూడా పెరుగుతున్నాయని, ఈ సమయంలో మీడియా విలువలు దెబ్బ తినకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెంలో ఎపిఎంఎఫ్ పటిష్టతకు తన వంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు. గ్రామీణ జర్నలిస్టులకు వృత్తి నైపుణ్యం పెంపొందించడానికి మీడియా ఫెడరేషన్ తరపున శిక్షణ తరగతులు నిర్వహించాలని, అందుకు సహకారం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి బి. సతీష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత మన రాష్ట్ర జర్నలిస్టుల కోసం మన యూనియన్ ఉండాలనే లక్ష్యంతోనే ఎపిఎంఎఫ్ ఆవిర్భవించిందని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం, వారి సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్న ఏకైక యూనియన్ ఎపిఎంఎఫ్ అని తెలిపారు. రాష్ర్ట వ్యాప్తంగా ఎపిఎంఎఫ్ నిర్మాణం చురుకుగా జరుగుతోందని, జర్నలిస్టులందరూ ఫెడరేషన్ కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎపిఎంఎఫ్ జర్నలిస్టులపై దాడుల నివారణ కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎపిఎంఎఫ్ ఏలూరు డివిజన్ అధ్యక్షులు శాంతారావు, నర్సాపురం డివిజన్ అధ్యక్షులు విజయరాజు, కొవ్వూరు డివిజన్ అధ్యక్షులు రాము, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు ఉదయ భాస్కర్, భీమవరం ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కేతా సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు. జంగారెడ్డిగూడెంకు చెందిన జర్నలిస్టులు పలు సమస్యలపై మాట్లాడారు. అనంతరం జంగారెడ్డిగూడెం డివిజన్ ఎపిఎంఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా అలుగు ఆనంద శేఖర్, అధ్యక్షునిగా యువ టివి కరస్పాండెంట్ ప్రవీణ్, ఉపాధ్యక్షులుగా పుచ్చకాయల సునీల్ కుమార్, కార్యదర్శిగా నాగరాజు, సహాయ కార్యదర్శిగా కడిమి రాజేష్, కోశాధికారులుగా అప్ లాండ్ టైమ్స్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మహేష్ తదితరులు ఎన్నికయ్యారు.