సోనాభద్ర ఆదివాసీ మారణకాండ పై నిరసన
ఏలూరు, : జులై16న ఉత్తరప్రదేశ్ సోనాభద్ర లో ఆదివాసీలపై సాగిన మారణకాండను నిరసిస్తూ సీపీఎం,గిరిజన సంఘాల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గురువారం నాడు స్థానిక వసంతమహల్ సెంటర్ వద్ద వారీ కార్యక్రమం చేపట్టారు. ఈసందర్భంగా జరిగిన సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రవి,గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తెల్లం రామకృష్ణ మాట్లాడారు. సొనాభద్రకు చెందిన భూస్వాములు 200మంది గూండాలు మారణాయుధాలు చేతపట్టి దారుణ మారణాకాండ సాగించి పదిమంది ఆదివాసీలను బలిగొన్నారని విమర్శించారు. పలువురిని గాయపరిచారని అన్నారు.ఇంత జరిగినా ఉత్తర్ ప్రదేశ్,కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమన్నారు. ఆవు చావుకు కారణమైన వారికి కఠినంగా శిక్షిస్తామంటున్న బీజేపీ ప్రభుత్వం ఆదివాసీల ప్రాణాలంటే లెక్కలేదా అని ప్రశ్నించారు. తన మనువాద సిద్ధాంతంతో దళితులు, ఆదివాసీలు,మహిళలు, మైనార్టీల అణచివేత లో భాగమే ఈ దాడులన్నారు.గిరిజన చట్టాలు తుంగలో తొక్కి ఆదివాసుల భూములు భూస్వాములకు కట్టబెట్టేందుకే బీజేపీ చూస్తుందని విమర్శించారు. ఇకనైనా దోషులను తక్షణం అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని,ఆదివాసులకు భూములపై పూర్తి హక్కులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. తొలుత ఆదివాసీలపై మారణకాండను,బీజేపీ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.యోగి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇందులో సీపీఎం జిల్లా నాయకులు జి.నరసింహారావు, పి.రవికుమార్,కె.విజయలక్ష్మి, జి.వెంకట్రావు,నగర నాయకులు బి.జగన్నాధం, వి.సాయిబాబా, టి.దొర,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కారం భాస్కర్లు పాల్గోన్నారు