5 లక్షలు దాటిన గ్రామ వాలంటీర్ దరఖాస్తులు
• పోస్టు గ్రాడ్యుయేట్లూ దరఖాస్తు
• 2 లక్షలకుపైగా మహిళా అభ్యర్థులు
• గ్రామ వాలంటీర్ల కోసం పోటెత్తుతున్న దరఖాస్తులు
• అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన
• దరఖాస్తులకు 5వ తేదీ వరకు గడువు
• అసంపూర్తి దరఖాస్తులు సరిదిద్దుకునే సదుపాయం
• అభ్యర్థులకు ఆర్టీజీఎస్ సూచనలు
రాష్ట్ర ప్రభుత్వ నవరత్న పథకాల్లో ఒకటైన వాలంటీర్‌లకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వినూత్న ఆలోచనావిష్కరణ కార్యక్రమం గ్రామ వాలంటీర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గ్రామ వాలంటీర్ నియామకాల కోసం ప్రభుత్వం ఇటీవలే నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్ నియామకాల కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అనూహ్య సంఖ్యలో వస్తున్నాయి. కేవలం 8 రోజుల వ్యవధిలోనే ఆన్‌లైన్ దరఖాస్తులు 5 లక్షలు దాటిపోయాయి. మంగళవారం సాయంత్రం దరఖాస్తుల సంఖ్య 5,48,029కి చేరిందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) తెలిపింది. గ్రామ వాలంటీర్ కోసం దరఖాస్తు చేసకోవడానికి చివరి గడువు ఈ నెల 5వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు సమయ ఉంది. దాంతో ఈ దరఖాస్తుల సంఖ్య మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రోజుకు సాలీనా 60 వేలకుపైగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ కొలువుల భర్తీ కోసం గ్రామ వాలంటీర్ వెబ్‌సైట్‌ను ఆర్టీజీఎస్ రూపొందించింది. గ్రామ వాలంటీర్ కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో సులభంగా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ వెబ్‌సైట్‌కు నెటిజన్ల నుంచి కూడా అనూహ్య స్పందన వచ్చింది.
ఇప్పటి వరకు ఈ వెబ్‌సైట్‌ను తిలకించిన వారి సంఖ్య 16లక్షలు దాటింది.
పోస్టు గ్రాడ్యుయేట్లు సైతం.
గ్రామ వాలంటీర్ పోస్టులకు పోస్టు గ్రాడ్యుయేట్లు సైతం పోటీ పడుతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వాలంటీర్ కోసం 10,589 మంది, ట్రైబల్ ప్రాంతాల్లో 194 , పట్టణ ప్రాంతాల్లో 4347 మంది పోస్టు గ్రాడ్యుయేట్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు వచ్చిన మొత్తం 5 లక్షలకు పైగా దరఖాస్తుల్లో మహిళా అభ్యర్థులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారు. ఇప్పటి వరకు 2.30లక్షల మందికి పైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు కొన్ని అసంపూర్తిగా పూరించడం లాంటి తప్పిదాల వల్ల స్వల్ప సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. ఇప్పటి వరకు ఇలా కేవలం 28వేలకు పైగా దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి.