ముగ్గురిపై వేటుతో అసంతృప్తుల్లో కలకలం
ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటుతో అసమ్మతివర్గంలో ఆందోళన
సుప్రీం కోర్టుకు వెళ్లనున్నఅసంతృప్తులు
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వారిలో ముగ్గురిపై శాసనసభ స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేయడంతో ముంబైలోని అసమ్మతి శిబిరంలో కలకలం రేగింది. రెండు రోజుల క్రితం శాసన సభలో బలం లేక సంకీర్ణ ప్రభుత్వం కూలిన విషయం తెలిసిందే. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రకటించారు.
బెంగళూరు: పదవికి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలలో ముగ్గురి రాజీనామాలను సమగ్రంగా పరిశీలించి వారిపై అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ ప్రకటించారు. రాణి బెన్నూరు ఎమ్మెల్యే ఆర్.శంకర్ గోకాక్ ఎమ్మెల్యే రమేష్ జార్కిహొళి, అథణి ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి లు ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వ్యవహరించినందున అనర్హత వేటు అనివార్యమైందని స్పీకర్ వెల్లడించారు. ముగ్గురిపై వేటు పడటంతో ముంబైలో గడుపుతున్న అసంతృప్తుల్లో ఒక్కసారిగా అలజడి చెలరేగినట్టు అయింది. దీనికి తోడు మిగిలిన రాజీనామాలకు వారాల గడువు తీసుకొనేది లేదని రోజుల వ్యవధిలోనే ముగిస్తాననే స్పీకర్ ప్రకటనతో మరో నాలుగైదు రోజుల్లో అందరి భవిష్యత్ తేలిపోనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటును కాంగ్రెస్ అధ్యక్షులు దినేష్ గుండూరావ్, శాసనసభ పక్షనేత సిద్దరామయ్యలు స్వాగతించారు. వారిరువురు వేర్వేరుగా ట్వీట్‌లు చేశారు. ఇక ముగ్గురిపై వేటు పడటంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి అథణి, గోకాక్, రాణి బెన్నూరులలో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నట్లు ముంబై నుంచి ప్రకటించారు.