బీజేపీ లోకి మాజీ ఎంపీ వివేక్

BJPలోకి వివేక్.. తెలంగాణలో కమల దళానికి మీడియా అండ


 తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ జోరుమీదుంది. ఎలాగైనా బలపడాలని చూస్తోన్న కమలం పార్టీ గూటికి మాజీ ఎంపీ వివేక్ చేరబోతున్నారని సమాచారం.
 


ఆపరేషన్ కమలంలో భాగంగా తెలుగు రాష్ట్రాలకు నేతలకు బీజేపీ గాలం వేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో ఎలాగైనా బలపడాలని.. అధికారంలోకి రావాలని కాషాయ దళం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఎంపీ గడ్డం వివేక్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. గత లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన కూడా బీజేపీలో చేరడానికి సుముఖంగా ఉన్నారు. మంగళవారం బీజేపీ చీఫ్ అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. వివేక్‌తోపాటు ఆయన సోదరుడు, మాజీ మంత్రి వినోద్ కూడా బీజేపీలో చేరతారని సమాచారం.
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ అనూహ్యంగా బాల్క సుమన్ చేతిలో ఓడారు. అనంతరం కారెక్కిన ఆయనకు ప్రభుత్వ సలహాదారు పదవి దక్కింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్‌ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి పెద్దపల్లి టికెట్‌ తనదేనని వివేక్ భావించారు. కానీ కేసీఆర్ మాత్రం వెంకటేశ్ నేతకు టికెట్ ఇచ్చారు. వివేక్‌కు టికెట్ దక్కకపోవడానికి ఆయన సోదరుడు వినోద్ వ్యవహర శైలే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది.
కొన్నాళ్లుగా సైలెంట్‌గా ఉన్న వివేక్, వినోద్ సోదరులు టీఆర్ఎస్‌కు బీజేపీయే సరైన ప్రత్యామ్నయం అని భావించారని తెలుస్తోంది. పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు ఎక్కువమంది వివేక్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించగా అక్కడి నుంచి బోర్లకుంట వెంకటేశ్‌కు టీఆర్ఎస్ ఎంపీ టికెట్‌ను కేటాయించింది. రేపు ఉదయం ఢిల్లీ వెళ్లనున్న వివేక్.. మధ్యాహ్నం 12గంటల సమయంలో అమిత్ షాతో భేటి అయ్యి, ఆయన సమక్షంలోనే కమలం గూటికి చేరనున్నారు.
వివేక్ బీజేపీలో చేరితే తెలంగాణలో ఆ పార్టీకి మీడియా అండ లభించినట్టే. వీ6 ఛానెల్‌తోపాటు వెలుగు పత్రిక వివేక్‌ కుటుంబీకులదేననే సంగతి తెలిసిందే.