నేటి నుండి విఐపి బ్రేక్ దర్శనాల ఎల్1, ఎల్ 2, ఎల్3 లను రద్దు చేస్తున్నాం - టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే ప్రముఖులకు కేటాయించే విఐపి బ్రేక్ దర్శనంలో ఎల్1, ఎల్ 2, ఎల్3 లను జూలై 17వ తేదీ బుధవారం నుండి రద్దు చేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం ఉదయం టిటిడి ఛైర్మన్, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి.ధర్మారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ..శ్రీ వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమలకు విచ్చేసే ఎక్కువ మంది సామాన్య భక్తులకు మరింత సౌకర్యావంతంగా, సులభంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బ్రేక్ దర్శనంలో ఎల్1, ఎల్ 2, ఎల్3 లను ఈ రోజు నుండి రద్దు చేస్తున్నామన్నారు. రెండు మూడు రోజుల్లో సాఫ్ట్ వేర్ అప్‌డేట్ చేసిన అనంతరం ఎల్1, ఎల్ 2, ఎల్3 ల రద్దును అమలులోకి తీసుకువస్తామన్నారు. ప్రోటోకాల్ ప్రముఖులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా దర్శనం కల్పించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం విఐపి బ్రేక్ దర్శనాలకు 3 గంటలకు పైగా సమయం పడుతుందని, దీనిని అంచెలంచెలుగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిదంగా ఆలయ సాంప్రదాయం ప్రకారం సన్నిధి గొల్ల వంశపారపర్యంగా నియమించేందుకు చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.
చెన్నై, బెంగుళూరు, న్యూ ఢిల్లీ, ముంబాయి తదితర పట్టణాలలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసిన విధంగానే నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయవలసిందిగా అధికారులకు సూచించామన్నారు. టిటిడి కార్యాలయం విజయవాడలో ఉన్నందున్న, అమరావతిలో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నందున ఇక్కడ కూడా సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ఇదివరకు ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర రాజధాని హైదరాబాదులో టిటిడి కార్యాలయం, సమాచారకేంద్రం ఉన్నవిధంగా అమరావతిలో ఏర్పాటు చేయాలన్నారు. అంతేగాని ప్రత్యేకంగా ఛైర్మన్ క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయవలసిందింగా కోరలేదని వివరించారు.