టీడీపీ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గము - లోకేష్ విమర్శలు
ప్రభుత్వంపై ట్విట్టర్‌లో టీడీపీ నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. గుంటూరు జిల్లా పొనుగుపాడుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వెళ్ళకుండా .. పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. టీడీపీ మద్దతుదారుల ఇళ్లకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా.. వైసీపీ నేతలు గోడ కట్టినప్పుడు ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరైనా ఎక్కడైనా పర్యటించవచ్చని, శుక్రవారం హోంమంత్రి ప్రకటించారని గుర్తుచేశారు. హోంమంత్రి మండలంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రం సంగతి ఏంటని నారా లోకేష్ మరోసారి ప్రశ్నించారు.
గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు వెళ్తున్న టీడీపీ నిజనిర్థారణ కమిటీ బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ బృందాన్ని ఉదయం నుంచి నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించారు. ఇంకా పోలీసుల అదుపులోనే టీడీపీ నేతుల ఉన్నట్లు సమాచారం. పొనుగుపాడులో ఎన్నికల ఫలితాల అనంతరం గ్రామంలోని టీడీపీ సానుభూతిపరుల ఇళ్లకు దారి లేకుండా వైసీపీ వర్గీయులు గోడ కట్టారు. టీడీపీకి ఓటు వేశామని గోడ కట్టారని భాదితులు చెబుతున్నారు. ఈ సమస్యపై దృష్టి పెట్టిన టీడీపీ అధిష్టానం అసెంబ్లీలో చర్చకు వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. నిజనిర్థారణ కమిటీ బృందంలో డొక్కా మాణిక్యవరప్రసాద్, బచ్చుల అర్జునుడు, అశోక్‌బాబు, శ్రావణ్‌కుమార్, జీవీ ఆంజనేయులు ఉన్నారు.