స్థానిక ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ ఘనవిజయం
- ఎల్‌డిఎఫ్‌కు 22 , యుడిఎఫ్‌కు 17 స్థానాలు
- శబరిమలలో లెఫ్ట్ అభ్యర్థి జయకేతనం
- రాహుల్ నియోజకవర్గంలోనూ భారీ ఆధిక్యతతో గెలుపు
తిరువనంతపురం : కేరళలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారిక ఎల్‌డిఎఫ్ ఘనవిజయం సాధించింది. 13 జిల్లాల్లోని 44 డివిజన్లు, మున్సిపల్ వార్డుల్లో జరిగిన ఎన్నికల్లో ఎల్‌డిఎఫ్ 22 స్థానాల్లో గెలుపొందింది. 17 స్థానాలను యుడిఎఫ్ కైవసం చేసుకుంది. బిజెపి ఐదు స్థానాలకు పరిమితమైంది. ఎల్‌డిఎఫ్ సాధించిన సీట్లలో ఎనిమిది సీట్లు గతంలో యుడిఎఫ్ గెలుపొందినవి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సిపిఎం, ఎల్‌డిఎఫ్ పార్లమెంటు సీట్లు కోల్పోవడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున దుష్ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 28న వచ్చిన ఈ ఫలితాలు ఎల్‌డిఎఫ్ పట్టును కోల్పోలేదని తేల్చాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన నెలరోజుల అనంతరం కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.