అందుబాటులో ఉన్న నీటి వనరులను సంపూర్ణంగా, సమర్థవంతంగా వినియోగించి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలకు సాగునీరు, మంచినీరు అందించే విషయంలో కలిసి ముందుకు సాగుతామని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు పచ్చగా కలకలలాడాలని, వ్యవసాయానికి, తాగునీటికి, పరిశ్రమలకు నీటి కొరత రాకుండా చూడాలనే లక్ష్యంతో ఉన్నట్లు వివరించారు. నదీ జలాల వినియోగానికి సంబంధించి గతంలో ఉన్న వివాదాలను గతం గతః అన్న రితీలో మరిచిపోయి, మంచి మనసుతో రెండు రాష్ట్రాలకు ఎంత వీలయితే అంత మేలు చేసే విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ వేర్వేరు అనే భావన తమకు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలు బాగుండాలన్నదే తమ అభిమతమని వెల్లడించారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఉభయ ప్రభుత్వాలు పనిచేస్తాయని ప్రతిన బూనారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతం, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాలు ఎదుర్కుంటున్న దశాబ్దాల సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. గోదావరి నీటిని శ్రీశైలం రిజర్వాయర్ కు తరలించే వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.
రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను సహృద్భావ వాతావరణంలో చర్చల ద్వారా పరిష్కరించునే దిశగా అడుగు వేయాలని నిర్ణయించుకున్నతర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తొలి అధికారిక సమావేశం శుక్రవారం ప్రగతి భవన్ లో జరిగింది. ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి.రాజేంద్ర నాథ్, కురసాల కన్నబాబు, పేర్ని వెంకట్రామయ్య(నాని), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రమణ్యం, సిఎం ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లం, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, సీనియర్ అధికారులు ఎల్.ప్రేమ చంద్రారెడ్డి, కె.ధనుంజయ రెడ్డి, నీటి పారుదల శాఖ ఇఎన్సి ఎం.వెంకటేశ్వర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ తరుఫున ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు ఈటెల రాజెందర్, ఎస్.నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సీనియర్ ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, జెన్ కో -ట్రాన్స్ కో సిఎండి డి.ప్రభాకర్ రావు, సలహాదారుడు టంకశాల అశోక్, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, నీటి పారుదల శాఖ ఇఎన్సీ మురళీధర్, రిటైర్డ్ ఇంజనీర్లు శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులున్నారు. ప్రగతి భవన్ చేరుకున్న జగన్ బృందానికి ముఖ్యమంత్రి, ఇతర తెలంగాణ మంత్రులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభోపన్యాసం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల సంబంధాల్లో గుణాత్మక మార్పు వచ్చిందని కేసీఆర్ స్పష్టం చేశారు.
''బేషజాలు లేవు. బేసిన్ల గొడవ లేదు. అపోహలు లేవు. వివాదాలు అక్కర్లేదు. వివాదాలే కావాలనుకుంటే మరో తరానికి కూడా మనం నీళ్ళివ్వలేము. కేసీఆర్, జగన్ లు వ్యక్తిగతంగా ఆలోచించరు. ప్రజలకోణం నుంచే ఆలోచిస్తరు. ప్రజలు నమ్మి మాకు ఓటేశారు. వారికి మేలు చేయడమే మా బాధ్యత. రెండు రాష్ట్రాలు కలిసి నడిస్తేనే ప్రగతి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధాల్లో ఇప్పుడు గుణాత్మక మార్పు వచ్చింది. పూర్తి అవగాహనతో, పరిస్థితిని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ, రెండు రాష్ట్రాల ప్రజలు మనవారే అనే భావనతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. ఎపి ముఖ్యమంత్రి జగన్ స్వచ్ఛమైన హృదయంతో వ్యవహరించారు. కలిసి నడుద్దామనుకున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలోని ముఖ్యమంత్రులు కలిసి పాల్గొనడం మంచి సంకేతం ఇచ్చింది. మహారాష్ట్రతో సయోధ్య కుదుర్చుకోవడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకోగలిగాం. అదే విధంగా రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలుంటే, అంతిమంగా ప్రజలకు మేలు కలుగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రజలకు ఎంత వీలయితే అంత మేలు చేయడమే మా లక్ష్యం'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
''తక్కువ ఖర్చుతో రెండు రాష్ట్రాల ప్రజలకు కావాల్సిన నీరు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఉత్తమమైన, సులభమైన మార్గం ద్వారా సాగునీటి కష్టాలు తీర్చాలి. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతోంది. రాబోయే కాలంలో ఇంకా తగ్గవచ్చు. అందుకే గోదావరి నీటిని ఉపయోగించుకుని రాయలసీమ, పాలమూరు, నల్గొండ ప్రాంతాల సాగునీటి సమస్యను పరిష్కరించుకోవాలని ప్రభుత్వాలు కృతనిశ్చయంతో ఉన్నాయి. నీటిని ఎలా తరలించాలనే విషయంలో అధికారులు అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి'' అని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు.
సమావేశం సందర్భంగా నదుల్లో నీటి లభ్యతపై ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు గోదావరి, కృష్ణా వాటి ఉపనదులపై లెక్కలేనన్ని బ్యారేజిలు నిర్మించడం వల్ల కిందికి నీటి రాని పరిస్థితిని వివరించారు. సి.డబ్ల్యు.సి. లెక్కల ప్రకారం ఏ పాయింట్ వద్ద ఎంత నీటి లభ్యత ఉందో వివరించారు. గూగుల్ మ్యాపుల సహకారంతో గోదావరి, కృష్ణా నదుల నీళ్లను సమర్థ వంతంగా వినియోగించుకోవడానికున్న మార్గాలను ప్రతిపాదించారు.
''గోదావరి, కృష్ణా నదుల్లో కలిపి 4వేల టిఎంసిల నీటి లభ్యత ఉంది. ఈ నీళ్లను ఉపయోగించుకుని రెండు రాష్ట్రాలను సుభిక్షం చేయవచ్చు. కావాల్సినంత నీళ్లున్నాయి. ఆ నీళ్లను ఉపయోగించుకోవడానికి విజ్ఞత కావాలి. ఎన్ని నీళ్లను ఉపయోగించుకుంటామన్నది మన సమర్థత మీద ఆధారపడి ఉంది. ప్రతీ ఏటా దాదాపు 3వేల టిఎంసిల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. నీళ్లకోసం ట్రిబ్యునళ్ల చుట్టూ, కోర్టుల చుట్టూ,మరొకరి చుట్టూ తిరగడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుని, కలిసి నడిస్తే చాలు. రెండు నదుల్లో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల ప్రజలకు వినియోగించే విషయంలో ఏకాభిప్రాయం ఉంటే చాలు. కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం అనే ప్రతిపాదన తెస్తున్నది. మన నదుల నీళ్లు మన అవసరాలు తీర్చాక కేంద్రం చెప్పే ప్రతిపాదన విషయంలో మనం నిర్ణయం తీసుకోవచ్చు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువ ఉన్నందున గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలించాలి. దీనివల్ల సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రాయలసీమ, పాలమూరు, నల్గొండ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నీటి గోస తీరుతుంది. పోలవరం నుంచి వేలేరు ద్వారా విశాఖపట్నం వరకు నీళ్లు తీసుకుపోవాలి. వంశధార, నాగావళి నదుల నీళ్లను కూడా సముద్రం పాలు కాకుండా సమర్థంగా వినియోగిస్తే తమకు నీళ్లు రావడం లేదని, తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామనే ఉత్తరాంధ్ర వాసుల బాధ కూడా తీరుతంది'' అని సిఎం కేసీఆర్ ప్రతిపాదించారు.
ఆంధ్రప్రదేశ్ బృందంతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో మద్యాహ్న భోజనం చేశారు.
నీటిని సంపూర్ణంగా వినియోగించు కోవాలి