*బ్రిటిషర్లు కట్టారని పార్లమెంట్ కూల్చేశారా అన్న జయప్రకాశ్ నారాయణ్.. ప్రజావేదిక కూల్చివేతపై జేపీ:*
ప్రజావేదిక కూల్చివేతపై లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రభుత్వ భవనాన్ని కూల్చేయాలంటే దానికి బలమైన కారణం ఉండాలని ఆయన పేర్కొన్నారు. అది ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించేదిగా ఉంటేనే ఈ తరహా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన తన అభిప్రాయం గా చెప్పారు. అంతేకాదు ఏపీ ప్రభుత్వం ప్రజా వేదికను కూల్చివేయాలని తీసుకున్న నిర్ణయంపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇది రాచరిక వ్యవస్థ కాదు.. ఏది పడితే అది చేసి ప్రజా ధనం దుర్వినియోగం చెయ్యటానికి అన్న జేపీ ఒక చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు . ప్రజాధనాన్ని పొదుపుగా వాడటం పాలక ప్రభుత్వాలకు అవసరమని జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. పూర్వకాలం జమిందారుల వ్యవస్థలా , రాచరికంలా, నిజాముల పాలనలా అప్పటికప్పుడు తోచింది చేస్తే ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని జయప్రకాశ్ నారాయణ్ తెలిపారు. తెల్ల వాళ్ళు కట్టారని పార్లమెంట్ భవనాన్ని నాటి ప్రభుత్వాలు కూల్చేయలేదని జేపీ అన్నారు. వలస రాజ్యానికి ప్రతీకలు అయినప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దన్న కారణంతోనే వాటి కూల్చివేతకు పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు.
తెల్లోళ్ళు కట్టిన పార్లమెంట్ ను కానీ, రాష్ట్రపతి భవన్ ను కానీ కూల్చేయలేదన్న జేపీ
ఇక సెక్రటేరియట్లోని నార్త్, సౌత్ బ్లాక్ లు కానీ , నాటి వైస్రాయ్ ప్యాలెస్ అయిన రాష్ట్రపతి భవన్ ని కానీ కూల్చివేయలేదని జేపీ అన్నారు. దానికి కారణం బ్రిటిషర్ల నుండి ఆ భవనాలు మనం తీసుకున్నప్పటికీ, మన వనరులు మనం కూల్చివేయడం విజ్ఞత కాదని భావించే నేటికీ వాటిని అలానే ఉంచారని జేపీ పేర్కొన్నారు.
గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండకూడదు అనే ఆలోచనతో కూల్చివేతకు పాల్పడడం సమంజసం కాదని జేపీ అన్నారు. ఒకవేళ కూల్చేయాలంటే దానికి ప్రత్యేకమైన కారణాలు, అది కూడా తీవ్రమైన కారణాలు అయి ఉండాలని జేపీ అభిప్రాయపడ్డారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీవ్రమైన కారణాలు అయితేనే ఈ తరహా నిర్ణయం తీసుకోవాలని, పుర్రెకు బుద్ధి పుట్టిందని ఏది పడితే అది చేస్తే సమంజసం కాదని జేపీ పేర్కొన్నారు.
దేశంలోనే ఈ తరహా నిర్ణయం తొలిసారి అన్న జేపీ .. ప్రజలకు సమాధానం చెప్పాలన్న జేపీ
దేశంలో ఏ ప్రభుత్వాలు ఈ తరహా చర్యలు తీసుకోలేదని, స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటి వరకు ఎవరూ ఈ తరహా చర్యలు ఎవరూ తీసుకోలేదని జేపీ పేర్కొన్నారు.
కూల్చివేతకు సంబంధించి నిర్దిష్టమైన బలమైన కారణాలు ప్రభుత్వం ప్రజలకు చెప్తుందని ఆశిద్దాం అని ఆయన అన్నారు. రాజు గారి మనసులో తోచినట్లుగా ఏదిబడితే అది చేయడానికి ఇది రాచరికం కాదని ,ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు జేపీ. ఏదో వందేళ్ళ నాడు కట్టిన శిధిలావస్థకు చేరుకున్న భవనం కాదని, ఇటీవల చేసిన నిర్మాణం అని ఆయన పేర్కొన్నారు. అక్రమ నిర్మాణం అని, నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేపట్టడం చట్టరీత్యా నేరమన్న భావన ఉంటే దానికి సహేతుకమైన కారణాలు చూపి, ప్రజలను ఒప్పించి , ఆ భవనం కూల్చివేత వల్ల కలుగుతున్న ప్రజా ప్రయోజనాలను చూపి , ఆ భవన నిర్మాణానికి అయిన ఖర్చును, లాభనష్టాలను బేరీజు వేసి చేయవలసి ఉంటుందని అలా కాకుండా నా ఇష్టం అన్నట్లుగా నిర్ణయం తీసుకోవడం సరైన పద్ధతి కాదని జెపి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.